సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, మే 2017, బుధవారం

అశ్రు నివాళి

అశ్రు నివాళి
--------------
మమతాను రాగాలు మనిషియై జన్మించి
ధన్యత గాంచిన తన్వి తాను
బంధు జనుల పట్ల బహు ప్రీతి జూపించి
తల లోన నాల్కయౌ తన్వి తాను
పేద సాదల కింత పెట్టు ధర్మ నిరతి
తనరారు చేతల తన్వి తాను
భర్తయు , బిడ్డల పటు ప్రేమ లను బొంది
తనిసి జీవించిన తన్వి తాను

ఇన్ని యిచ్చియు నారోగ్య మీని యీశ్వ
రుని చెయిదమును ప్రశ్నించ పనిగొని  తను
నా  సుభాషిణి  దివికేగె -- నశ్రు జలము
లారవు నయనాల  --  నివాళు లందు కొనుము .

19, ఏప్రిల్ 2017, బుధవారం

ఆవకాయ - అమరావతి

ఆవకాయ - అమరావతి
-----------------------------
భక్ష్య లేహ్య చోష్య బహువిథ భోజ్యాల
రుచులు చూచి చూచి రోత పుట్టి
నాల్క తుప్పు డుల్చు నవవిథ రుచి గూర్చి
తపము జేసె నొక్క ధార్మికుండు .

మంగళ గిరి ప్రాంతమునకు
చెంగట దిగి యతడు తపము జేయుచు నుండన్
రంగారు విపిన తలములు
క్రుంగంగా బారె నతని ఘోర తపమునన్ .

తపము బలము నింద్రు తాకెను , తనకేదొ
మూడె ననుచు నతడు ముగ్ధలైన
అప్సరోవనితల నంపె తపము గూల్చ
తలిరు బోడు లటకు తరలి రంత .

ఆమని యరుదెంచె నామ్ర తరువులన్ని
పూప పిందె బట్టి పొలుపు దాల్చె
రంభ కాయ గోసి రాగాల కారమ్ము
ఉప్పు పసుపు గూర్చి యూర బెట్టె .

మేనక ప్రియపడి మృదువుగా నందులో
నావ పిండి గలిపి చేవ గూర్చె
పప్పునూనె బోసె పరువాల యూర్వశి
రుచికి పడి ఘృతాచి లొట్ట సేసె .

అల్లంత దూరమందున
నుల్లము రంజిల్ల ' ఘాటు ' నోరూరించన్
కళ్లు దెరిచి వెళ్లి తబిసి
యల్లన రుచి చూచి తన్మయత్వము నందెన్ .

కొత్తావకాయ రుచి గని
తత్తర పడి తబిసి తపము ధన్యత గాంచన్
బిత్తరు లందరను గూడి
చిత్తము రంజిల్ల విడిది చేసెను తోటన్ .

పోయిన భామలు రాలే
దేమయినదొ యంచు నింద్ర దేవుడు వెదుకన్
ధీ మహితులు సురలందరు
భూమికి దిగి వచ్చి చూడ ' బొమ్మ ' కనబడెన్ .

తబిసి తలిరు బోళ్లు తనివార కొత్తావ
కాయ రుచులు గొనుచు కన బడి రట
దేవ గణము గూడి దేవాధిపతి గూడ
వచ్చి చేరి రుచికి మెచ్చి నారు .

ఆవ కాయ రుచికి యమరులు పరవశం
బంది స్వర్గ సీమ మరచి నారు
అచటె యుండి పోయి ' రమరావతి ' యనంగ
' నాంధ్ర రాజధాని ' యయ్యె  నేడు .

17, ఏప్రిల్ 2017, సోమవారం

మా కుల్లూరు -- 15

మా కుల్లూరు -- 15
---------------------
బలిజ కులము దొరలు , పలు ' గృహనామా 'ల
వాళ్ళు , కలిమి బలిమి గలిగి యిచట ,
సకల సంపదల , ప్రశాంత జీవనమును
గడపి నారు , నాటి కాల మందు .

తల్లి తరపు వాళ్ళు  , తగని పౌరుష గాళ్ళు ,
' తోట ' వాళ్ళు , మాకు తొలి గురువులు  ,
విద్య లందు గాని , విఙ్ఞానమున గాని ,
పధ్ధ తందు గాని బహు విదురులు .

' లక్కాకుల ' వాళ్ళ బలము
తక్కుంగల వాళ్ళ కంటె తగ నెక్కువ గా
లెక్కకు మిక్కిలి యుందురు
పక్కాగా చతుర వచన పటిమలు గలుగన్ .

' మాదాసు ' వాళ్ళు చదువుల
ప్రాథాన్యత సంపదలును భక్తియు గలుగన్ ,
' యాదాల ' వాళ్ళు గ్రామా
మోదముగల ప్రముఖులు , పుర ముఖ్యులు , మరియున్ ,

కార్య దక్షులు ' నలగండ్ల ' వాళ్ళందరు ,
' అందె ' వాళ్ళు సంప దందు ఘనులు ,
' చీర్ల ' వాళ్ళు ప్రతిభ శీలురు , మరియు ' రే
చర్ల ' వాళ్ళు బుధులు సర్వ విథుల .

' దరిమడుగు ' వాళ్ళు పండితుల్ , ' దర్శి ' వాళ్ళు
తీర్పరులు , ' సాదు ' వాళ్ళు ప్రదీప మతులు ,
ఘనులు ' దారము ' వాళ్ళు ప్రాకట యశముల ,
' అచ్యుతుల్ ' ఘనులు వివిథ కళాత్మ కతల .

వ్యాపార కళా దక్షులు
చూపుల ' కంబాల ' వాళ్ళు ,  ' సుంకర ' వాళ్ళున్
ప్రాపు వహించిరి , హిత ని
క్షేపాలు ' సుసర్ల ' వాళ్ళు  , ' శీలము ' వాళ్ళున్ .

16, ఏప్రిల్ 2017, ఆదివారం

మా కుల్లూరు -- 14

మా కుల్లూరు  -- 14
----------------
పోలేరమ్మకు ప్రక్కన
నాలో నొక గుడియు నుండె , నంకమ్మది , యే
కాలముదో , పాడయ్యెను ,
శ్రీలొలుకగ దాని గట్టె శేషయ్య కడున్ .

ఎగువ పాళె మందు భగవతి మహలక్ష్మి
కొలువు దీరె మహిమ గలుగు తల్లి
అచటి భక్తులెల్ల రామెకు కైంకర్య
మొనర జేయు చుంద్రు ఘనము గాగ .

చెరువుకు కోటకు మథ్యన
పరమ శివుని గుడి గలదు , శివార్చన పరు లా
వర రాజాన్వయు లెవరో
చిరకీర్తులు గట్టి రెపుడొ , శిథిలం బయ్యెన్ .

అదిగొ శివుని గుడిని యాదాల కృష్ణయ్య
పట్టు బట్టి మరల గట్టి నాడు
భక్త తతులు వచ్చి పరమేశు పూజలు
జరుగు చున్న వచట చాల ఘనము .

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

మా కుల్లూరు -- 13

మా కుల్లూరు -- 13
---------------
వర్తకుల వీథిలో నొక భజన చౌక
యుండెడిది , దాని పైన మా యూరి వాళ్ళు
శిరిడి సాయికి  గుడిగట్టి  సేవజేసి
కొలుచు చున్నారు గొప్పగా తలచి తలచి .

సాయి బాబ గుడిని సత్యనారాయణ
పూని నిర్వహించి పూర్తి జేసె
ఖర్చు కొఱకు తిరిగి కాళ్ళరిగి పోయినా
జన్మ ధన్య మయ్యె చాల వరకు .

అమరా సుబ్బారావను
విమలాత్ముడు , బాబ భక్త వినుతుండు , కడున్
శ్రమకోర్చి , దిన దినమ్మును
కమనీయముగా నొనర్చు కైంకర్యములన్ .

వినుతి కెక్క గట్టె  వెంకయ్య స్వామికి
గుడిని భక్త జనులు కొలిచి తలువ
నాగరాజుపల్లి నాగేశ్వరుడు పూని
పూర్వ జన్మ ఫలము పుణ్య ఫలము .

వేడుకగా విఘ్నేశ్వరు
నాగుడిలో నిల్పె , మా సుధాకరుడు , మహా
భాగుడు , స్తవనీయ యశో
సాగరుడును , తోట వంశ జలనిధి శశియున్ .

13, ఏప్రిల్ 2017, గురువారం

మా కుల్లూరు -- 12

మా కుల్లూరు -- 12
----------------------
చెంచయ్య శెట్టి మా చిరకాల సర్పంచి
చల్ల చెన్నారెడ్డి సరి మునసుబు
అందె చెన్నప శెట్టి యరుదైన కామందు
బిస్సాటి రోశయ్య ప్రియ కరణము
మాదాసు సోదరుల్ మారాజు లన్నింట
యాదాల రోశయ్య యలఘు శెట్టి
కంబాల గురుమూర్తి ఘనుడైన వ్యాపారి
దువ్వూరి కిచ్చమ్మ దొడ్డ మనిషి

దర్శి చెంచురామయ్య భూధవుడు మిగుల
ఊరు వూరంత ధనికులే , వీరు గాక
నాడు పేరైన పెద్ద లెందరొ గలుగుట
చేత కుల్లూరు మిగుల ప్రఖ్యాతి గాంచె .

చదువుకు తన సర్వస్వము
వదులు కొనుట కైన సిధ్ధ పడె , వదాన్యుం
డది గరుడయ్యెకె చెల్లును
సదయుడు కాలేజి కొరకు సంపద లిచ్చెన్ .

హైస్కూలు కాలేజి కన్నియుం గూర్చెను
హాస్పిటల్ దెప్పించి హాయి గూర్చె
వీథి వీథికి రోడ్లు వేయించె గొప్పగా
పెన్న నీళ్ళిప్పించి ప్రియము గూర్చె
చెన్నకేశవ గుడి చెన్నొంద గట్టించె
పూజాధికముల విభూతి గూర్చె
అభయాంజనేయుని యరుదైన నలువది
యడుగుల విగ్రహం బరయ గూర్చె

నేడు మాయూరి కొక్కరే నేత , యంద
రకును , మాదాసు గంగాధరం హితుండు ,
కోరి తన యూరి యభివృధ్ధి కొరకె గాక ,
ప్రాంతమును గూడ యభివృధ్ధి బరచు చుండు .

12, ఏప్రిల్ 2017, బుధవారం

మా కుల్లూరు -- 11

మా కుల్లూరు -- 11
---------------------
నెల్లూరు దాటి వచ్చిన
కుల్లూరే దిక్కు , చదువు కొనుటకు , చాలా
పల్లెలు , నెల్లూరు కడప
జిల్లా వాళ్ళిటకు వచ్చి చేరిరి చదువన్ .

వరద రాజులు నాయుడు వంటి వారు
చేరి హెడ్మాష్టరుగ పని చేసి రిచట ,
కోరి గంగాధరం లాంటి గొప్పవారు
చేరి చదివిరి ఘనులైరి తేరి చూడ .

ఎందరో ఘను లీ స్కూలు నందు జదివి
యున్నతిని బొంది రేనున్ను నుద్యమించి
కోరుకొని వచ్చి యభివృధ్ధి గూర్చి నాడ
కూడి గంగాధరం గారు తోడు నిలువ .

ఏడెకరాలస్థలమున
నాడొక బిల్డింగు గట్టినా , రది మిగులన్
పాడయ్యెను , రేకులు పగి
లాడాడ , రిపేర్లు చేసి తంతట , కోరన్ -

ఎనిమిది పక్కా రూముల
కనుమతి యిప్పించి నారు , కట్టిరి భవనాల్ ,
ఘనముగ గంగాధర్ గా
రనయం మా స్కూలటన్న యభిమానముతో .

కలదు బిల్డింగు ముందు వెన్కలను గ్రౌండు
కంప మొలిచి పాడయ్యె వెన్కాల గ్రౌండు
బాగు చేయించి నామిట్టి పనికి గూడ
పరగ గంగాధరం గారు పాటు పడిరి .

పది పరీక్ష జరుపు పబ్లికు సెంటరు
కోరి విన్నవించ పోరు సలిపి
కాంక్ష దీర్చి నారు గంగాధరం గారు
పాఠశాల గూర్చి ప్రణతు లిడుదు .

ఘాటైన కఠిన వైఖరి
పాటించితి నాడు , స్కూలు బాగు పడుటకై ,
నాటికి నాముందున్నది
దీటుగ మన స్కూలు ప్రగతి దీపించుటలే .

ఆయెన్ అర్వది యెన్మిదేండ్లు పయిగా , హైస్కూలు బెట్టించియున్ ,
వ్రాయంగా మనసాయె కొన్నయిన , కాలాతీతమై పోవునే
మో , యీ మాత్ర చరిత్ర యైన గనరేమో నేటి విద్యార్థులన్
ధ్యేయంబారసి వ్రాసినాడ , నిది గుర్తించండి కుల్లూరులో .

11, ఏప్రిల్ 2017, మంగళవారం

మా కుల్లూరు -- 10

మా కుల్లూరు -- 10
----------------------
చీర్ల శింగరయ్య శెట్టి డొనేషను
కట్టె , నతని పేర ఘనము గాగ
అప్పు డెపుడొ యిచట హైస్కూలు పెట్టిరి
చదువు లన్న నెంత చవులు ప్రజకు !

నెల్లూరికి దూరములో
కుల్లూరున స్కూలు బెట్టి కూడా యరువై
యేళ్లకు పైగా గడచెను
యెల్లర కిది చదువు జెప్పె నీ ప్రాంతములో .

నలభయ్యేడు స్వతంత్రము ,
నలభై తొమ్మిదిన స్కూలు నడిపించిరి పె
ద్దలు మా కుల్లూరున తా
వెలుగులు విరజిమ్ము చుండె విద్య గరపుచున్ .

తల్లీ ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ , నీవు నా
యుల్లంబందున నిల్చి , జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము , నీదు వాక్కునను సంప్రీతిన్ , జగన్మాతరో !
కుల్లూరున్నత పాఠశాల యన నీకుంగీర్తి చేకొందుమే .

నా డీ ప్రార్థన పద్యము
పాడితి మట , ప్రతి దినమ్ము పరవశమున , నా
పోడుములకు గురువులు పో
రాడిరి , కామయ్య గారు వ్రాసిరి దీనిన్ .

ఏ పాఠశాల నా కెంతయు విఙ్ఞాన
మిచ్చి గురు స్థాన మెక్క జేసె
ఏ పాఠశాల నా యెదుగు దలకు నిల్చి
బుధ్ధులు గరపె ప్రాపులు వహించి
ఏ పాఠశాల నాకింత బ్రతుకు దెరు
వొసగె నిచ్చెన యయి స్ఫూర్తి నిచ్చి
ఏ పాఠశాల తా నీప్రాంత ప్రజలకు
విద్యా ప్రదాతయై వినుతి కెక్కె

నట్టి హైస్కూలు ' హెచ్ యం ' గ నరిగి , నాటి
గొప్ప దనములు సాధించు కొఱకు పూని ,
పూర్తి సాఫల్య ఫలములు పొంది నాను
తల్లి సేవతో  జన్మమ్ము  ధన్య మయ్యె .

10, ఏప్రిల్ 2017, సోమవారం

మా కుల్లూరు -- 9

మా కుల్లూరు -- 9
----------------
 పేలి తిప్ప దిగువ వీరాంజ నేయులు
విగ్రహమ్ము బండ వెలసి యుండ
పరగ నాకు దెలిసి బహుకాల మందుండి
దేవళమ్ము వెలుగు దివ్య మగుచు .

నాదు చిన్న తనము నందొక యఙ్ఞమ్ము
జరిగె నిచట దైవ సన్నిధి కడ
మహిత హితము గలుగె మహనీయు లెందరో
వచ్చి వైభవమ్ము వచ్చె గుడికి .

కుల్లూరున్నత పాఠశాలకు తగన్ గూర్చంగ పూర్వోన్నతుల్
వెళ్లే వాడిని ఆంజనేయుడిని సేవించన్ పదోక్లాసు మా
పిల్లల్నెల్లర గొంచు పూజలకు పబ్లిక్ వ్రాయు మున్ముందు తా
నెల్లన్ జల్లగ జూచి పిల్లలను దీవించంగ నెంతేనియున్ .

9, ఏప్రిల్ 2017, ఆదివారం

వెంకయ్య స్వామి శతకం --12

                     ఉప సంహారము
                    -----------------------
దివ్య మంగళ కళల్ దీపించు శిరముపై
పట్టు భిగియ తలపాగ జుట్టి
ధోవతి భిగియించి దోపి కట్టిన పంచె
అర్థ ముతక చొక్క యమర దొడిగి
తగ నిరాడంబరత తనర నిసుమంత
స్వార్థ పరత లేని స్వచ్చతముడు
కొంద రనుచరులు కూడి వర్తించంగ
నిటుల మాయింటి వాకిటికి వచ్చె

వచ్చి కూర్చుండె కుర్చీలొ వరదు , డపుడు
రమ్ము పోద మనుచు బిల్చె , సమ్మతించి
వెడలితిని నేను స్వామితో వీడు వెడలి ,
కల తొలంగెను , మెలకువ కలిగె నంత .   -- 101

మండే కీలల మధ్యన
గుండములో నుండి ' ఇంకు ' గుడ్డల తోడన్
నిండుగ నా స్వప్నములో
దండిగ నొకనాడు స్వామి దర్శన మిచ్చెన్ . --102

రయముగ ఓంనారాయణ
నయమార భజించి ఆదినారాయణుడా !
జయమిమ్మని ప్రార్థించితి                        -- 103
దయామయుడు స్వామి మదికి దాపున నిల్చెన్ .

 అరిషడ్వర్గము లంటని
పరిపూర్ణుడు స్వచ్చతముడు పరమాత్మ కళా
భరితుడు మహితాత్ముడు నుత             -- 104
చరితుడు వెంకయ్యస్వామి చరణము గొలుతున్ .

నీవే మాజీవితములు
నావయి నడిపింతు వనుచు నమ్మితి మయ్యా !
సేవింతు మనుదినమ్మును
భావింతుము మనసు నిండ భగవానునిగా . -105

ఇడుమ లెన్నొ బడితి నికనైన విశ్రాంతి
గలుగ బరువు మోయ వలయు నీవు
బరువు నీవు మోసి పరమాత్మ ! యికనైన
కావు మయ్య నన్ను కమల నయన !      -- 106

                 ఫలశ్రుతి
                 -----------
స్వామి ! నీకటాక్ష ప్రభ లెంత దవ్వేగు
నంత వట్టు జనుల కండ యగుత !
చిరము నిన్ను దలచి శ్రీరస్తులై జను
లిహము పరము గాంతు రెలమి స్వామి !  -- 107

వెంకయ్య స్వామి శతకము
సంకట హరణమ్ము , దీని జదివిన విన్నన్
వెంకట రమణుని సాక్షిగ
సంకటములు బాయు , సుఖము శాంతియు గల్గున్ .                                             -- 108

                    -- స్వస్తి --

8, ఏప్రిల్ 2017, శనివారం

వెంకయ్య స్వామి శతకం -- 11

పసుల , జనుల రోగ బాధలు దొలగంగ
జేసి  గ్రామ చీటి వ్రాసి నావు
పల్లె పల్లె దిరిగి పలుమార్లు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 91

నేడు పల్లె పల్లె నీదు గుడులు గట్టి
నిన్ను నిలిపి కొలిచి సన్నుతించి
భక్తు లైరి నీకు పరమాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 92

అరయ నేటి కేటి కారాధనోత్సవ
ప్రభలు పెరిగె  , జనుల భక్తి పెరిగె
మ్రొక్కు కొనుట పెరిగె , ముదమయ్యె , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 93

నేడు పల్లె లందు నియతిగా గుడి కేగు
టన్న నీదు గుడికె నెమ్మనమున
నిలిచి కోర్కె దీర కొలుతురు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 94

ఒక్క ప్రొద్దు లుందు రొనరంగ శనివార
మందు నిన్ను దలచి మహిత చరిత !
భక్త జనులు గలరు ప్రతి యింట , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 95

కలలు పండు గాక  కళ్యాణ మౌగాక
బిడ్డ గలుగు గాక ప్రియము మీర
వచ్చి నిన్ను గొలువ వరమగు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 96

కోరి వత్తు రేని ఆరాధ నోత్సవ
మందు గొలగ మూడి మహిమ దెలిసి
పనులు చక్క బడును , పరమాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 97

క్షేత్ర దర్శనమ్ము , శ్రీ స్వామి దర్శన
భాగ్య , మట భుజించు భాగ్య మొంద
నార్తి తొలగి పోవు , నభయమ్ము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 98

నీదు మాల వేసి నియమాలు పాటించి
గొలగ మూడి వచ్చి కొలని లోన
మ్రొక్కు దీర్చు కొనగ మోక్షమే , వెంకయ్య 
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 99

పాత్రత గలదేని క్షేత్ర దర్శన మగు
ఇహ పరముల శుభము లిందు నందు
బడయ వచ్చు జనులు , పరమాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 100

7, ఏప్రిల్ 2017, శుక్రవారం

వెంకయ్య స్వామి శతకం -- 10

వెంకయ్య స్వామి శతకం -- 10
------------------------------------
కావిడి గొనిపోయి ఘనుడు నారాయణ
నాలు గిల్ల భోజ నాలు దేగ
యేమి తినిరొ యేమొ యెరుగము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 81

చేపల వల బూని చేరువ నొక్కండు
పూల సజ్జ బట్టి పూజ కొకడు
యెవరి తీరు గొప్ప యెరుగమా , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 82

మనిషి చూపు గరిమ మార దరువది నాల్గు
అందు నొకటి మార నంధు డగును
దీని భావ మేమొ దెలియము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 83

బలిమి లక్ష లారు కలియుగ దేవుళ్ళ
చూపు లంటి వయ్య శోధన యొన
రించ మేము చాల లేమయ్య , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 84

మూడు కాలములను చూడ జాలిన గొప్ప
ఆత్మ శక్తి గలుగ  , నక్షరాల
నీవు నుడువు మాట నిజమౌను , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 85

పరగ చుట్ట జుట్టి పైపంచ విసరుచు
జబ్బు పడ్డ వాళ్ళ జబ్బులెల్ల
తొలుగి యడగి పోవ  ద్రోచితి , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 86

తనది యొకటె ధ్యాస తంబూర మీటుచు
ధ్యాన యోగ మందు దగిలి యుంట
ధ్యాస లౌకి కమున దగులదు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 87

వ్రేలి ముద్ర లొనర వేయుచు నుందువు
ధ్యాన మందు లేని తరుణ మందు
నాడు వాటి విలువ నరయము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 88

ముద్ర లేసి నీవు ముదమార నిచ్చిన
కాగి తాలు నాడు ఘనము గాగ
దేవుని గదు లందు దీపించె , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 89

నీదు చేయి తాకి నిమిరిన దారాలు
మంత్ర పూత మైన మహిమ దాల్చి
మాకు రక్ష యిచ్చె , మహితాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 90

6, ఏప్రిల్ 2017, గురువారం

వెంకయ్య స్వామి శతకం -- 9

వెంకయ్య స్వామి శతకం -- 9
-----------------------------------
సత్య ధర్మ రతులు  సద్గురు సేవల
నియతి బ్రతుకు వారు నిర్మలులును
నిన్ను నమ్ము జనులు  , నిజమిది , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   --71

రాజు కెంత యున్న  రాజుకే యగు గాని
మనము జేసు కున్న మటుకె మనకు
ఆశ పడకు డంటి వయ్య , శ్రీవెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 72

జీవు లన్ని టందు చేరి నేనుందును
తెలిసి కొనుడు జనులు దీని ననుచు
ప్రాణి హింస చేయ వలదంటి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   --73

అంతరాలు మాని అంద రొక్కటి కాగ
మెలుగు డంచు మమ్ము మలచి నావు
కులము లెన్ని యున్న కొలిచిరి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 74

పరగ గొలగమూడి పదిహేను వందల
స్థలము దైవ భూమి తర తరాలు
వెలుగు వెలుగు నంటి , వేర్పడె , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 75

ఆత్మ పరిమళించి అత్యంత సౌందర్య
రూపు దాల్చి శక్తి ప్రాపు బొంది
జనుల కొఱకు నిల్చె జగమున  , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 76

కోరుకున్న జనుల కొంగు బంగారమై
కోరి  వెలసి నావు  గొలగమూడి
క్షేత్ర మందు మాకు సిరిమాను , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 77

ఉండు టెల్ల నాడు  మొండి గోడల మధ్య
తాటి యాకు పరచి  , దాని మీద
యెంత మక్కువయ్య , యెరుగమా , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.    -- 78

నాగు లొక్క ప్రక్క  సాగి కాటేసినా
చిద్వి లాస హాస సిరు లొలుకుచు
యోగ సాధనమున నుంటివి , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 79

అర్థ ముతక చొక్క యట్టిదే పంచయు
తడిపి యార బెట్ట తప్ప దనగ
ఏమి గట్టి నారొ యెరుగము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు.   -- 80

5, ఏప్రిల్ 2017, బుధవారం

రాముడే రాజుగా ... రక్షగా .....(గేయం)

రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా

ఒక్కటే మాటగా ఒక్కటే శరముగా
ఒక్క సీతయె సతిగ యుగపురుషుడై నిలిచె /రాముడే/

దండ్రి కిచ్చిన మాట తలదాల్చి కడదాక
పడరాని యిడుముల పడియునూ విడువని /రాముడే/

అన్నగా తమ్ములకు ఆదర్శమూర్తిగా
మన్ననలు పొంది యీ మనుజులందరకు /రాముడే/

రావణుని చావుతో రామబాణము శక్తి
రామనామము శక్తి రాజిల్లె లోకాన /రాముడే/

తొలుత శ్రీరామయని పలుకులో రాతలో
పలుకక రాయక వెలయింప రేదియు /రాముడే/

పల్లెలా పట్నాల ప్రతి మందిరాలలో
కడగి సీతారామ కళ్యాణములు సేయ/రాముడే/


వెంకయ్య స్వామి శతకం -- 8

మలిన మంట నట్టి మహనీయు లెవరైన
గలర ఘను లటన్న  నిలను సాయి ,
నీవు దప్ప లేరు , నిజమిది , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 61

దాయ లార్గురు తమ దరి జేరగా లేరు
గనుకనె పరమాత్మ కళలు మిమ్ము
జేరెను మహితాత్మ చిరముగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 62

స్వచ్చ తములు మీరు  స్థావర జంగముల్
మీ యనుఙ్ఞ మేర మీర లేవు
మీకు సాధ్య పడని మేరలా ? వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 63

శ్రీ శరీర సహిత శివ మూర్తులై యుండ
చేరి కొలిచి నట్టి తీరు కంటె
జన సముద్ర మిపుడు ఘనమయ్యె , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 64

నాడు మీరు జూపి నట్టి యద్భుతముల
కంటె నేడు జనులు కనుల ముందె
కోరి తీర్చు కొనుట కొల్లలు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 65

సకల కర్మ లందు సంసారి  ధర్మమ్ము
తప్పకున్న గొప్ప , తగ నదేమి
గొప్ప గాదు రుషికి , చెప్పితి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 66

దారి తప్ప కుండ  దారాన్ని తెగకుండ
చూచు కొనుడు నేను కాచు కుందు
మిమ్ము విడువ నంటి , మేలయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 67

లాభ మందె మనసు లయబెట్టి చూడొద్దు
పాప మందు కూడ భాగ మొదవు 
టరసి చూడు మంటి వయ్యరో ! వెంకయ్య
స్వామి శరణు నీదు చరణములకు .   -- 68

 పొసగ వేరొకరిని పొమ్మను కంటెను
మనమె తప్పు కొనుట మంచి దనుచు
మంచి జెప్పి నావు , మహితాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .  -- 69

గొఱ్ఱె లుండు వేలు గుంపులో మనగొఱ్ఱె
కాలు పట్టి తెచ్చు ఘనత కలదు ,
రండు రక్ష నిత్తు , రమ్మంటి వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 70

4, ఏప్రిల్ 2017, మంగళవారం

వెంకయ్య స్వామి శతకం -- 7

పదవ చూపు నాది పరికింప తగులుకో
పోవు చూపిదంచు పుణ్యమూర్తి !
నుడివి తీవు శక్తి గడియించి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 51

ఆకలి గొని వచ్చి యడిగిన వారికి
పట్టె డన్న మిచ్చి పంపు డనుట
నిన్ను గుర్తు దెచ్చు నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 52

గౌరవించి పిలువు మేరి నైనను , ఒరే
యనకు పాప మంటి వయ్య దేవ !
నీదు తత్త్వ మిదియె , నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 53

పాడు బుధ్ధి జూపి పావలా కాజేయ
పది వరాలు నీవి వదులు నంటి
వక్షరాల నిజము , రక్షకా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 54

మనిషి యందె దాగి మన తప్పు లొప్పులు
లెక్క జూచు చుందు రెలమి సాక్షు
లనుచు నెరుక పరచి తయ్య శ్రీ వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 55

కార్య ఫలము దెలియగా వచ్చు వారికి
వ్రాసి ముందె  ఫలము  వేసి ముద్ర
ముట్ట జెప్పినావు ముదమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 56

మోకు తుంట లొకట ముంతొక్క చేతిలో
యేటి పాయ మీది కేగి సాగి
మంట జేయు చుండు మహనీయ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 57

అర్బుదాలు కోటు లన  రామ రత్నాలు
మణులన జలయఙ్ఞ మహిత తపము
పంచితి వరుమాన ఫలములు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 58

అరయ నెవరి నైన అయ్యా యనుటయే
యిష్ట మంటి వయ్య , హితుడు వీవు
మానవాళి కంత , మహితాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 59

మనుజ కర్మ బాప మహి లోన జన్మించి
తపము జేసి తయ్య  దైవ మూర్తి  !
కొల్వ నిన్ను  కర్మ  కూలును  , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 60

3, ఏప్రిల్ 2017, సోమవారం

వెంకయ్య స్వామి శతకం -- 6

నీదు పాద ధూళి నిండిన నేలలు
పావనాలు  పుణ్య పథము లయ్య  ,
వర సుభిక్ష మగుచు వర్థిల్లు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 41

పొసగ గొలగమూడి పుణ్యాల పంటయై
దేవ భూమి యయ్యె  దివ్య మూర్తి !
నీవు వెలయ బట్టి , నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 42

కూడి తిరుగ నీవు  కుల్లూరు , రాజుపా
ళ్యమ్ము జనులు వృద్ధి యైరి , దేశ
దేశ ములను పేరు దెచ్చిరి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 43

పెన్న బద్దె వోలు పేరు ప్రఖ్యాతులు
పెనసె నయ్య నీదు పేరు తోడ 
దాని నిన్ను గలిపి తలుతురు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 44

వరలును కలువాయి , బ్రాహ్మణ పల్లెయు
నరయ నీవు తిరిగి నంత వట్టు
దినము దినము నెంత ఘనమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 45

నిన్ను నమ్ము వారు  నీమాట విను వారు
బాగు పడిరి మిగుల  పరమ పురుష !
వినక చెడిన వారు వెర్రులు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 46

నీ సమాధి చేరి  నీకు నివేదించి
చేయు పనికి నీవు సాయ మొనర
జేతు వనఘ ! నతులు జేతుము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 47

తలచి నిన్నడుగగ కలలోన పొడసూపి
అవును గాదను సన్న లరయ జేసి
సూచన లిడు టెంత శోభయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 48

బాల్య మందు నిన్ను  పరి పరి దర్శించి
దీవెనలను బడసి తేజమొప్ప
ఖ్యాతి గాంచి నాను  , ఘనుడవు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 49

వచన మందు  నీదు వర చరితము వ్రాసి
మ్రొక్కు దీర్చి నాను మక్కువముగ
ముక్తి నిమ్ము కష్ట ముల నుండి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 50

2, ఏప్రిల్ 2017, ఆదివారం

వెంకయ్య స్వామి శతకం -- 5

కోరి శిష్యు డయ్యె నారాయణ స్వామి
నీదు తోడు దిరిగి నీడ యగుచు
ఘనత దాల్చె నీవు కరుణించ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .  -- 31

చనవు మీర  నిన్ను చలమయ్య నాయుడు
కొలిచి నిలిచినాడు కూడి మాడి
అతడిదే యదృష్ట మన నొప్పు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 32

దయకు పాత్రు డయ్యె జయరామ రాజు తా
వచ్చి నీదు తోడ వాస మందు
వరము బొంది నాడు , వరదుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 33

రోజు కూలి యర్థ రూపాయి కొరగాని
కఱ్ఱి దేవుడయ్య ఘనత గాంచె
నీ కటాక్ష సిధ్ధి యే కదా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 34

పిలుపు వచ్చి రాగ  వెంటనే పెద్దయ్య
చేరి నీతొ దిరుగు చేరువయ్యె
నింత పుణ్య ఫలము సొంతమై , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 35

వెలయ చివర దాక  తులశమ్మ నిను గొల్చి
పుణ్య ఫలము బొందె  ,  ఫూజనీయ
సుకృత ఫలిత మిదియె ,  సులభుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 36

నీకు  సహచరించి నిన్గొల్చి తిరిగిరి
యెంద రెందరొ జను లంద రెంత
పూర్వ జన్మ లందు పుణ్యులో ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 37

తండ్రి పెంచలయ్య  తల్లియై పిచ్చమ్మ
కన్న కడుపు లెన్ని పున్నెములకు
ప్రోవులైరొ కొలువ బోలునా ? వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 38

నతులు నిన్ను గన్న నాగులేటూరుకు
ధన్య యయ్యె తాను ధరణి తల్లి
తల్లి పేరు నిలిచె స్థాయిగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 39

నీవు పాద మిడిన నేలలు , నీళ్లును
కొండ లడవు లున్ను కోన లున్ను
పావన మయి యొప్పు , భగవాను వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 40

1, ఏప్రిల్ 2017, శనివారం

వెంకయ్య స్వామి శతకం -- 4

కోటి తీర్థ శివుని కోవెల వెలుపల
నీవు పెంచి నట్టి నిడివి మఱ్ఱి
నీకు సాక్షి యగుచు నిలిచేను , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 21

తనర బావి లోకి తలక్రిందు వ్రేలాడ
కాళ్లు వేప కొమ్మ కాన్చి పెనచి
తపము జేసి తంట , ధన్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 22

ఆకు లోని యన్న మన్ని వైపుల నెట్టి
మధ్య లోది తిని , సమ సమముగ
భూతములకు బెట్టు పుణ్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 23

నీరు త్రాగు టేమి నీమమ్మొ , యేటిలో
మూతి ముంచి త్రాగు ముచ్చటేల !
తెలియ దింత దనుక , దేవుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    --  24

రాళ్ళు మాకు జూడ  , రత్నాల రాశుల
తీరు బద్దె వోలు తిప్ప నీకు 
తీరు చూడ చూపు తీక్ష్ణము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    --  25

యేటి చూపు కలదు నీటి పాయల యందు
కొండ చూపు కలదు కొండ లందు
అడవి చూపులు గల వడవుల , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    --  26

నడిమి నీట నాది నారాయ నుడివంట
జలధి మీద నడక సాగె నంట
అపర కళల భగవ దవతార ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 27

గొలగమూడి క్షేత్ర స్థలము మొత్తమ్మింక
రెండు వంద లేళ్ళు నిండి నాక
తిరుపతి యగు నంటి వరయగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 28

పడును క్షేత్ర మందు బంగారు గని యని
యంటి వయ్య  , ఋజువు కంటి మిపుడె ,
పసిడి పండు చుండె పచ్చగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 29

నిండి జనుల తోడ నిత్య కళ్యాణమై
పచ్చ తోరణముల పండు వగుచు
గొలగమూడి నేడు వెలిగేను , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 3031, మార్చి 2017, శుక్రవారం

వెంకయ్య స్వామి శతకం -- 3


చేరి గొలగమూడి  సారించి నిలిచిన
హృదయ పద్మ మందు ముదము గలుగు
గొలగమూడి క్షేత్ర నిలయుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 11

గొలగమూడి చనుచు  గొంతెత్తి పాడుచు
వచ్చు భక్త జనుల  పాద ధూళి
తాకినా జనులకు ధన్యతే , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 12

జబ్బు చేసి నిన్ను శరణు వేడంగనే
బాగు జేసి వారి బాధ నంత
నీవు తీసుకొనుట నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 13

నీకు దగ్గరైన  నిన్గొల్చు భక్తుల
స్వప్న మందు శేష శయను డగుచు
దర్శనమ్ము నిచ్చి దయజూచు వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 14

నేల లోపలైన , నింగిలో నైనను
నీరు , నిప్పు , గాలి  నియతి లోను
చూపు బరుప గలవు శోధింప  , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 15

తగులు కొనుచు పోవు దశమాన చూపులో
ప్రకృతి శక్తి నాపు ప్రతిభ గలదు ,
నీదు నాత్మ శక్తి నెరుగము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 16

కురియు మన్న కురియు కోరిన , నాగుమం
చన్న నాగు వర్ష మద్భుత మిది  ,
నిన్ను మీర గలద ? నేరదు  , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 17

తల్లి దండ్రి నీవు  దైవమ్ము నీవంచు
నమ్మి బ్రతుకు వారి నరసి నీవు
నీడ యగుచు వెనుక నిలుతువు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      --  18

పొసగ గుండ మేసి పోగొట్టి నావంట
బాధ లెగయు  నింటి బాధలెల్ల ,
బరువు మ్రోయ నీవె ప్రభుడవు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     --  19

పెన్న బద్దె వోలు  పెన్న పాయ పయిన
నీళ్ళ మీద మంట నెగడ జేసి
యజ్ఞ ఫలమొ సగిన యతివయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     --  20
             ----- వెంకట రాజారావు . లక్కాకుల

30, మార్చి 2017, గురువారం

వెంకయ్య స్వామి శతకం -- 2

  భగవాన్
గొలగమూడి వెంకయ్య స్వామి
-------------------------------------
బ్రతికి నంత వట్టు పరమాత్మ కళలతో
బ్రతికి ప్రజల కొఱకు పాటు పడితి ,
జనులు దేవు డనుచు వినుతించ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .       -- 1

దేహ ధారి యగుచు దీపించు నానాడు
వర సమాథి యందు వరలు నేడు
నిన్ను నమ్మినాము , నిలుమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 2

వ్రేలి ముద్ర వేసి వెచ్చించి  తపమును
చీటి వ్రాసి యిచ్చి  శ్రీలు  కలుగ
మాకు తోడయితివి , మాన్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు  నీదు చరణములకు  .    -- 3

జబ్బు చేసి నపుడు  సాగి పై పంచతో
విసిరి , దారములను  వేసి  మెడను
బాగు చేసినావు పరమాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 4

పేద ప్రజల గాచు పెన్నిధి నీవయ్య
ఆరు లక్ష చూపు లందు జూచి
ఆదుకొమ్ము మమ్ము , చేదుకో , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 5

బ్రతుకు బరువు మ్రోయ  గతి నీవె యని పూని
వచ్చి కొలుచు వారి వరదు డగుచు
గొలగమూడి లోన కొలువైన వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 6

గొలగమూడి జేరి కోవెల దర్శించి
నీ సమాథి తాకి నిన్ను దలచి
మ్రొక్కు కున్న తీరు మ్రొక్కులు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 7

అన్నదాన సత్ర మందున కూర్చుండి
భోజనమ్ము తిన్న పుణ్య జనుల
తృప్తి కొలువ లేము , ఆప్తుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 8

గొలగమూడి యాత్ర తలచుట తోడనే
అడ్డు దొలగి క్షేత్ర మరుగు వరకు
క్షేమ మరసి గాచు శ్రీలుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 9

నోరు దెరిచి ఆదినారాయణా ! యన్న
పిలుపు విన్న వెంట ప్రియము గూర్చ
నీవు వత్తు వనుట నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 10

29, మార్చి 2017, బుధవారం

తెలుగు వారికందరికీ ' హేవిళంబి ' శుభాకాంక్షలు .

వానలు తగినంత పడి పాడి పంటలు
తగ నితోధకముగ తనరు గాత !
ఆరోగ్య భాగ్యమ్ము లలరి జన గణము
లెల్ల భాగ్యాల భాసిల్లు గాత !
చదువు సంధ్యలు నేర్చి చక్కగా పిల్లలు
విజయాలు పొంది లాభింత్రు గాత !
పెరిగి యూర్లన్ని సుభిక్షమై , యొకరి
కింత బెట్టు పస లేతెంచు గాత !

' హేవిళంబి ' తెలుగుగాది హేళలు పర
చుకొని , సకల తెలుగు జాతి , సుఖము శాంతి
పాదుకొను గాత ! యేటి కేడాది యంత ,
అందరికి నా శుభాకాంక్ష లంద జేతు .

వెంకయ్య స్వామి శతకం -- 1

                 

 భగవాన్
       శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి
          ఆరాధన రూప పద్య శతకం            
                ( పరిచయము -- 1)
                   ----------------
         నేటి కాలంలో ఏ మలినమూ అంటని
మహాను భావులరుదు .అలాంటిమహనీయులలో
భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఒకరు .
          శ్రీ స్వామి నెల్లూరు జిల్లా , నాగులేటూరు గ్రామంలోవ్యవసాయకుటుంబంలోజన్మించినాడు .
బాల్యంలో వ్యవసాయం పనులు చేసే వాడు .
ఇరవై యేళ్ళ వయసులో ఊరొదిలి పెన్నానది లో
నూ , పెన్నకిరువైపుల గ్రామాలలోనూ తిరుగుచుం
డేవాడు .
         తనలోకంలో తానుండేవాడు . తదనంతర
కాలంలో తదేక ధ్యానంలో తంబూర మీటుతూ
తన కనువైన స్థలంలో గడిపే వాడు .  క్రమంగా
ఆప్రాంత ప్రజలు వెంకయ్య స్వామిగా గుర్తించి
గౌరవించడం ప్రారంభ మయ్యింది .
          ఆయన ఏది చెబితే అది జరిగేది . రోగగ్ర
స్తులకు మంత్రించి నయం చేసేవాడు . ఎవ్వరినీ
ఏదీ అడిగేవాడు కాదు . పిలిచి అన్నం పెట్టేవారు .
స్వామిని బాల్యమాది నేనెరుగుదును . మా గ్రా
మం కుల్లూరికి ప్రక్కన రాజుపాళెంలోనూ , కాస్త
దూరంలోని పెన్నబద్వేలు లోనూ ఎక్కువ గడిపే
వాడు . చాల నిరాడంబర జీవితం గడిపి నాడు .
            అర్థ ముతక చొక్కా ముతక పంచ ఆయన ఆస్తి . పైపంచ చుట్ట చుట్టి ప్రక్కన పెట్టు
కుని దానితో విసిరి మంత్రించి జబ్బులు నయం
చేసేవాడు . తినడం భిక్షాన్నమే .             కార్యార్థమై వచ్చి అడిగిన వాళ్ళకు చీటీ వ్రాయించి వ్రేలిముద్రలేసిఇచ్చేవాడు .ఆయనమాట విన్న
వాళ్ళంతాబాగుపడ్డారు .వినకచెడినవాళ్ళూఉన్నా రు .
              దాదాపు ఎనభై యేళ్ళదాకా బ్రతికి జ
నుల చేత భగవానుడిగా పూజింపబడి , చివరి
దశలో గొలగమూడి గ్రామంలో సమాధియైనాడు .
ఆ సమాథియే శ్రీస్వామి దేవాలయంగా , గొలగ
మూడి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నవి .
              ఈక్షేత్రం కొలిచిన వారికి కొంగు బంగార
మై వారి కోరికలు తీరుతూ భక్తజన సందోహంగా
మారింది . నేనెరిగిన వెంకయ్య స్వామి జీవిత
చరిత్రను ఉన్నదున్నట్లుగా పూర్వం ' భగవాన్ శ్రీ
శ్రీశ్రీ వెంకయ్యస్వామి వారి సత్య ప్రమాణ దివ్య చరితము ' గా వ్రాయడం జరిగింది .
              స్వచ్చమైన జీవితం గడిపి జనులతో
మమేకమై ఆత్మశక్తితో జనుల బాధలను తొలగిం
చిన ఆ నిరాడంబరుడు నా కారాథ్యుడు .
             చిన్న చిన్న ఆటవెలది పద్యాలతో ఆ స్వా
మి మహనీయ తత్త్వాన్ని ఆరాధిస్తూ శతకం వ్రా
యడం జరిగింది .
                ----- వెంకట రాజారావు . లక్కాకుల
              

28, మార్చి 2017, మంగళవారం

తెలుగుగాది .....

అల్లదే టీవీలొ అడ్డ నామాలోళ్ళు
అడ్డ దిడ్డముగ వాదాడు చుండ
బ్లాగులో ఎఫ్ బీ లొ రక రకాలుగ కవుల్
ఇసిరి పద్యాలు పారేయు చుండ
ఆండాళ్ళు టీవీల కంటుకోగ , మొగుళ్ళు
హోటళ్ళ నుండి సాపాటు తేగ
ఎండలకు తడారి గండు కోయిల గొంతు
పెగలక నీళ్ళకు వెతుకు చుండ

హేవిళంబియా - కాదుట - హేమలంబి ?
కాదు - హేవిలంబ యని చీకాకు పెట్ట
పండితుల్ , నేడో ? రేపొ ? రానుండె , తెలుగు
గాది  పర్వదిన మ్మిల మీదికి దిగి .

అదిగొ ! కందాయ ఫలము , రాజావమాన ,
పూజ్యములు దెల్ప , పంచాంగముల్ పఠించి
నుదుట వ్రాయంగ వచ్చారు బుధులు కనుము ,
కష్టమును నమ్ముకోకున్న కనము ఫలము .

మా కుల్లూరు -- 8

మా కుల్లూరు
----------------
ఖణ ఖణ ఖణ మంచు వినిపించు తప్పెట్ల
కదన శబ్దాలకు కాళ్ళు కదులు
ఫెళ పెళ పెళ మని విసురు పటాకత్తి
చండ ప్రహరలకు గుండె లదురు
ధగ ధగ ధ్వాంత మధ్యాంత్య శోభలతోడ
విను వీథిలో ఔట్లు ప్రేలు సొదలు
గిడి గిడి మేళాలు  కీలుగుర్రాలును
బుట్ట బొమ్మల కేళికాట్ట హాస

ములు కనంగను  ముసిలి యొగ్గులును కూడ
ఉరక లెత్తుదు రుత్సాహ పరవశమున
తవిలి దుర్గాష్టమిని  మహర్ణవమి నాడు
నొనరు కుల్లూరి దశరా మహోత్సవములు .