సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

1, సెప్టెంబర్ 2012, శనివారం

తెలుగులో మాటాడు .....


తెలుగులో మాటాడు

తెలుగు లోనె మాటాడు

తెలుగు వాళ్ళందరితో

తెలుగు తెలిసిన వారందరితో

తెలుగు లోనె మాటాడు               // తెలుగులో //

 

ముగ్థ మోహన రూపు

మురిపాల తెలుగు లిపి

ముత్యాల సిరి పేర్చు

ముగ్గులను తలపించు                 // తెలుగులో //

 

మురళీ రవం లాంటి

మోహన గానాలు పల్కు

 శబ్ద జాల మొలికించే

 సంగీతపు సరిగమ సిరి                  // తెలుగులో //

 

దిగంతాల నజంతాల

పద సంపద పొదువు కొన్న

నుడి కారపు సొంపులు గల

మడి మాన్యపు టక్షరాల                // తెలుగులో //

 

తెలుగు తోట పూ మొక్కకు

సంస్కృత లత లంటు గట్టి

తెలుగు దనపు నీరు పెట్టి

తెలుగు పూలు పూయించిన            // తెలుగులో //

 

మాతృ భాష మమకారం

మంచి నీటి చెలిమ పథం

పర భాషల వ్యామోహం

ఎండ మావి  చెలిమి విథం            // తెలుగులో //

27, ఆగస్టు 2012, సోమవారం

" విజయతే గోపాల చూడామణీ "



శ్రీకృష్ణ కర్ణామృతం లోని సంస్కృత శ్లోకానికి నా తెలుగు పద్యం

శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు
చెవుల కుండల దీప్తి చెలువు వాడు
నుదుటిపై కస్తూరి మృదు తిలకము వాడు
ఉరమున కౌస్తుభం బొలయు వాడు
నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
కరమున వేణువు మెరయు వాడు
చర్చిత మైపూత సరి చందనము వాడు
గళమున ముత్యాల కాంతి వాడు

తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
నంద గోపాల బాలు డానంద హేల
లీల బృందావనము రాస కేళి దేల
వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .