సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, జనవరి 2018, సోమవారం

నేడు వసంతపంచమి - అమ్మకు వందనం


నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా ! నీకు వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,

జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .

21, జనవరి 2018, ఆదివారం

పద్యమూ - పద్యకవులూ వర్థిల్లాలి

' పలుకు ' నన వేసి , ' మొగ్గయై ' భావ మొదిగి ,
' పద్య 'మై పూవు విడిసె - నిప్పగిది కవి - మ
నోజ్ఞ రుచిర పరిమళ వినూత్న భంగి
రస మయము జేసె తెల్గు నేలలు తరించ .

మొనసి నాబోటి వేవురు ముదముతోడ
పద్యమందలి రసభావ విద్యమాన
మథువు ద్రావి , తనిసి , కవి విథము దెలిసి ,
తనివి తీరంగ మెత్తుము తనను దలచి .

ఎంత రమణీయ మీ పూల పుంత !  మున్ను
నన్నయాది కవీంద్రులు సన్నుతముగ
తెల్గు నేలల దీర్చి ఖ్యాతిలగ జేసి
తెలుగు పద్య పూదోటలు దెచ్చినారు .

కోరి బుధు లనంగ హేరాళమై యిప్డు
పద్య మెవ్వడేని పరిఢవిల్ల
వ్రాసె నేని వచ్చి రాయిడి జేతురు
తప్పు తప్పు తప్పు తప్పటంచు .

కాస్త యెప్పుడైన స్కాలిత్యము దొరలు
అంత మాత్ర మతని సుంతయేని
సారహీను డనుచు చావగొట్టంగ నీ
ఘనులు తప్పెరుగని వినుతు లేమి !

తప్పు వెదుకుచు జదువు బుధవర ! కాస్త
దోరణిని మార్చుకో ! పద్యసారము గను !
మేలు భజియించు ! తలయూచు మించుకైన !
నిండు  రంథ్రైక ధ్యాసలో నుండి తలగు !